భక్తులకు అందుబాటులో 1,05,711 ఆర్జిత సేవాటికెట్లుశ్రీవారి ఆలయంలో త్వరలో మరో హుండీ ఏర్పాటు

డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి నవంబరు, డిసెంబరు నెలల్లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11.00 గంటలకు 1,05,711 టికెట్లను ఇంటర్నెట్‌లో విడుదల చేసినట్టు తితిదే

కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు వెల్లడించారు. అక్టోబరులో మొదటి శుక్రవారం 7వ తేదీన బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కావడంతో సేవా టికెట్ల విడుదల సాధ్యం కాదని, ఈ కారణంగానే రెండు నెలలకు సంబంధించిన సేవా

టికెట్లను విడుదల చేశామని తెలిపారు. విజయవాడకు చెందిన భవానీశంకర్‌ అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానమిస్తూ శ్రీవారి ఆలయంలో ప్రస్తుతమున్న కొప్పెరహుండీ వద్ద భక్తుల తోపులాటను అరికట్టేందుకు సమీపంలోని లక్ష్మీదేవి విగ్రహం

చెంత మరో కొప్పెరహుండీని ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. తీర్థం, శఠారి వద్ద ఇచ్చే సమయంలో భుక్తుల తోపులాటను అరికడతామన్నారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారంనాడు జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు చేసిన సలహాలు, సూచనలకు ఈవో సమాధానాలిచ్చారు.

1. మల్లికార్జునరావు – నెల్లూరు

ఆర్జిత సేవా టికెట్లు ప్రతిరోజూ విడుదల చేయండి?

ఇ.ఓ. సేవా టికెట్ల బుకింగ్‌లో అవకతవకలను అరికట్టేందుకు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రతినెలా విడుదల చేస్తున్నాం. ఒక సారి సేవాటికెట్‌ పొందిన భక్తులు తిరిగి 90 రోజుల వరకు బుక్‌ చేసుకునే అవకాశముండదు.

2. బుచ్చన్న – మంచిర్యాల.

తిరుమలలోని సప్తగిరి కాటేజీలో సిసి కెమెరాలు ఏర్పాటుచేయండి?

ఇ.ఓ. సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేస్తాం.

3. సుబ్బరత్నమ్మ – ప్రొద్దుటూరు, విశ్వనాథరెడ్డి – చింతామణి.

తిరుమలలోని అశ్వని ఆసుపత్రిలో సత్వరం వైద్యం అందించేలా చర్యలు చేపట్టండి?

ఇ.ఓ. ఆశ్వని ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి తగిన సూచనలిచ్చి సత్వరం వైద్యం అందించేలా చూస్తాం.

4. సురేష్‌రెడ్డి – చిత్తూరు.

నడకదారిలో మధ్యలో రెండు చోట్ల పాలు అందించేలా చూడండి?

ఇ.ఓ. పరిశీలిస్తాం.

5. సావిత్రి – హైదరాబాద్‌.

ఎస్వీ నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు ఇ-డొనేషన్‌ ద్వారా విరాళం ఇచ్చాం, అక్నాలెడ్జిమెంట్‌ రాలేదు?

ఇ.ఓ. మిమ్మల్ని సంప్రదించి సంబంధిత వివరాలు తెలియజేస్తాం.

6. రంగనాయకులు – తిరుపతి.

రద్దీ తక్కువగా ఉన్నా తోపులాటను అరికట్టలేకపోతున్నారు?

ఇ.ఓ. రద్దీ తక్కువగా ఉన్నపుడు భక్తులకు ప్రశాంత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడతాం.

7. రాజలక్ష్మి – హైదరాబాద్‌.

శ్రీవారి సేవకులను తితిదే అధికారులు తక్కువ చేసి మాట్లాడుతున్నారు?

ఇ.ఓ. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ద్వారా తితిదే అధికారులకు, శ్రీవారి సేవకులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. చదువుకున్నవారు, సేవాభావం మెండుగా ఉన్నవారు శ్రీవారి సేవకు వస్తే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు

వీలవుతుంది.

8. వెంకటరమణ – విశాఖపట్నం.

సుప్రభాతం తదితర సేవల్లో పాల్గొనే వృద్ధులకు నడిచే దూరం తగ్గించండి?

ఇ.ఓ. ఇలాంటివారు ముందుగా సంప్రదిస్తే బయోమెట్రిక్‌ మార్గంలో ఆలయానికి అనుమతిస్తాం.

9. శ్రీనివాసన్‌ – చెన్నై.

దాతలకు శ్రీవారి బ్రేక్‌ దర్శనం విషయంలో ప్రాధాన్యత పెంచండి?

ఇ.ఓ. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. తితిదే ట్రస్టులు, పథకం ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు దాతలు చేయూతనివ్వండి.

10. లాలు – కర్ణాటక.

ఎస్వీబీసీ ఛానల్‌ ప్రసారాలు బాగున్నాయి. ధన్యవాదాలు?

ఇ.ఓ. ఎస్వీబీసీలో నాణ్యమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. నాదనీరాజనం కార్యక్రమంలో ఎ గ్రేడ్‌ కళాకారులు, పద్మ అవార్డులు పొందిన కళాకారులను ఆహ్వానించి ప్రదర్శనలు ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

11. సత్యనారాయణ – తూర్పుగోదావరి.

అన్నప్రసాదంలో లిక్విడ్‌తో కూడిన సాంబారు, రసం, మజ్జిగ అందిస్తున్నారు. కొద్దిగా కూర, పులిహోర కూడా జత చేయండిి? సాయంత్రం అల్పాహారం ఇవ్వండి?

ఇ.ఓ. అన్నప్రసాద భవనంలోని ఒక హాల్‌లో బఫె పద్ధతిని అమలుచేస్తున్నాం. ఇందులో ఎవరికి కావాల్సిన వంటకాలను వారు స్వీకరించవచ్చు. ప్రస్తుతం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అల్పాహారం అందిస్తున్నాం.

సాయంత్రం కూడా అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

12. రాజారాం – జగ్గయ్యపేట, శేషాద్రి – బెంగళూరు.

శ్రీవారి ఆలయ గాలిగోపురానికి సున్నం కాకుండా అందులోని శిల్పాలు కనిపించేలా రంగులు వేయండి?

ఇ.ఓ. గాలిగోపురానికి సంప్రదాయబద్ధంగా సున్నం వేస్తారు. రంగులు వేసే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

13. లక్ష్మీకాంత్‌ – బెంగళూరు.

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆలస్యమైంది?

ఇ.ఓ. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు దర్శన స్లాట్‌ ఉండడంతో ఒక్కోసారి రూ.300/- టికెట్ల భక్తులకు ఆలస్యమవుతోంది.

14. సరళ – తిరుపతి.

జింకలపార్కులో జింకలకు ఎండకు, వానకు ఇబ్బందులు లేకుండా షెడ్లు ఏర్పాటుచేయండి?

ఇ.ఓ. ఏడు ఎకరాల విస్తీర్ణంలో గల జింకల పార్కులో నీడ కోసం అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. జింకలకు ఆహారం, నీరు అందించడంతోపాటు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాం. అడవి జంతువులకు షెడ్లు అవసరం లేదు.

15. నళిని – బెంగళూరు.

శ్రీవారి బ్రేక్‌ దర్శన టికెట్లు పొందేందుకు కొందరు డబ్బులు అడుగుతున్నారు, వాటిని పొందడమెలా?

ఇ.ఓ. ప్రోటోకాల్‌ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే బ్రేక్‌ దర్శన టికెట్లను మంజూరు చేస్తున్నాం. రూ.300/- టికెట్లు కొనుగోలు చేసి సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దళారులను అరికట్టేందుకు భక్తులు

సహకరించాలి.

16. నరసింహులు – నల్గొండ.

ఆధార్‌కార్డు నంబరును పరిగణనలోకి తీసుకుని సామాన్య భక్తులకు సంవత్సరంలో రెండు సార్లు దగ్గరగా స్వామివారి దర్శనం కల్పించండి. నకిరేకల్‌లో శ్రీనివాస కల్యాణం చేయించండి?

ఇ.ఓ. సామాన్య భక్తులకు సంతృప్తికరమైన శ్రీవారి దర్శనం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. నకిరేకల్‌లో తప్పకుండా శ్రీనివాస కల్యాణం జరిపిస్తాం.Related posts

Leave a Comment