శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జితసేవా టికెట్లు జారీ – తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్యం జరిగే ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్ల జారీని మరింత సరళతరం చేయనున్నట్లు తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవంనంలోని తమ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జితసేవల తరహలోనే అమ్మవారి ఆలయంలో సేవా టికెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య పూజలు, వారపు సేవలు, వార్షిక సేవలు భక్తులకు అందుబాటులో వుండేందుకు ఈ-దర్శన్‌ కౌంటర్‌లలో లభ్యమయ్యెటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు తగిన విధంగా ఐ.టి. అప్లికేషన్‌ రూపొందించాలని సూచించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తితిదే వెబ్‌సైట్‌లో వుంచాలన్నారు. అదేవిధంగా అమ్మవారి ఆలయం ముందు సేవలకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. తద్వారా టికెట్ల జారీ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుందని తెలిపారు. వచ్చే గురువారం నుండి అమ్మవారి ఆలయంలో నిర్వహించే తిరుప్పావడ సేవకు టికెట్లను బుధవారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన సేవా టికెట్ల కౌంటర్‌ వద్ద క్యూ లైన్ల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ, ఈఈ శ్రీ వేణుగోపాల్‌, డిప్యూటీ ఈఈ శ్రీ ఉమాశంకర్‌, సిఏఒ శ్రీ రవిప్రసాద్‌, ఏవి అండ్‌ ఎస్‌ఒ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.Related posts

Leave a Comment