భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలితితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు

శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో ”శ్రీవైష్ణవ భక్తితత్వం”పై

మహిళలతో 12 గంటల నిర్విరామ జాతీయ సదస్సు

సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృతిని విద్యార్థిని విద్యార్థులు పాటించడంతోపాటు భావితరాలకు అందించాలని తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు కోరారు. తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ”శ్రీవైష్ణవ భక్తితత్వం” పేరిట తిరుపతిలోని శ్రీ పద్మావతి కళాశాలలో బుధవారం పూర్తిగా మహిళలతో 12 గంటల పాటు నిర్విరామ జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధులు విచ్చేయడం విశేషం.

ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీవైష్ణవ భక్తితత్వంపై పూర్తిగా మహిళలు ఇలాంటి జాతీయ సదస్సు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మానవులు నిరాశలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచి విశ్వాసం నింపేది భక్తి మాత్రమేనన్నారు. ఈ సదస్సులో భక్తితత్వం గొప్పదనం గురించి విద్యార్థినులు తెలుసుకుని, ఆచరించాలని సూచించారు. సనాతన ధర్మం పట్ల సమాజంలో అభిరుచి, జాగరణ పెంచేందుకు తితిదే వివిధ ప్రాజెక్టుల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ప్రత్యేక విశిష్ట అతిథిగా వచ్చిన తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా||వి.జి.చొక్కలింగం ప్రసంగిస్తూ భగవద్‌ రామానుజులు శ్రీవైష్ణవ భక్తితత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. శ్రీ రామానుజులు ”అచిత్‌, చిత్‌, ఈశ్వరుడు” అనే తత్వ త్రయం ద్వారా భగవంతుని గురించి తెలియజేశారన్నారు. నవవిధ భక్తిమార్గాల ద్వారా దేవున్ని ప్రసన్నం చేసుకోవచ్చన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు సతీమణి శ్రీమతి జ్యోతిష్మతి మాట్లాడుతూ శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీవైష్ణవ భక్తితత్వంపై జాతీయ సదస్సు నిర్వహించడం, ఇందులో పూర్తిగా మహిళలు పాల్గొనడం ముదావహమన్నారు. కళాశాల విద్యార్థినులు ఈ సదస్సులోని అంశాలతోపాటు భక్తి శక్తిని తెలుసుకోవాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపాల్‌ డా|| పి.జ్ఞానకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సభ్యులు డా|| కె.పద్మావతి, తిరుపతికి చెందిన తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు శ్రీమతి గంగవరపు శ్రీదేవి, సదస్సు సంచాలకులు డా|| వి.కృష్ణవేణి ప్రసంగించారు. అనంతరం అతిథులను శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు.

సదస్సులోని ముఖ్యాంశాలు :

జాతీయ సదస్సులో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య ఎన్‌.మునిరత్నమ్మ అధ్యక్షతన ”రామాయణం”, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య ఎస్‌.రాజేశ్వరి అధ్యక్షతన ”మహాభారతం”, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షతన ”భాగవతం”, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు తిరుపతికి చెందిన డా|| వి.కృష్ణవేణి అధ్యక్షతన ”భగవద్‌ రామానుజాచార్యులు”, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పుంగనూరుకు చెందిన ఆచార్య గుమ్మనూరు ఉషారాణి అధ్యక్షతన ”తాళ్లపాక అన్నమాచార్యులు”, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన డా|| ఆర్‌ఎస్‌ఎస్‌.శైలేశ్వరి అధ్యక్షతన ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ” అనే అంశాలపై పలువురు అధ్యాపకులు, పండితులు, పరిశోధక విద్యార్థులు తమ పత్రాలను సమర్పించారు. వీరితోపాటు శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల, శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల అధ్యాపకులు అదనంగా పత్ర సమర్పణ చేశారు.Related posts

Leave a Comment