తిరుమలలో ఘనంగా ఉట్లోత్సవం

vedanarayana-swamy-copy



తిరుమలలో శుక్రవారం ఉట్లోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరుసటిరోజు తిరుమలలో ఉట్లోత్సవాన్ని (శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితి.

ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను తితిదే రద్దు చేసింది. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి సాక్షాత్తు శ్రీ మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామి మరో తిరుచ్చిపై తిరువీధులలో ఊరేగుతూ వచ్చారు.

ముందుగా ప్రాతఃకాలారాధనం, మధ్యాహ్నికారాధనం అయిన తరువాత ఈ ఉత్సవమూర్తులు ముందుగా పెద్దజీయంగార్ మఠానికి వేంచేయగా ఆరగింపు హారతి, బహుమాన నివేదనలు నిర్వహించారు. అనంతరం హథీరాంజీ మఠానికి, అటుపిమ్మట కర్ణాటక సత్రాలు వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఉత్సవర్లు కలియతిరుగుతూ ఉట్లోత్సవంలో పాల్గొన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు, భక్తులు ఉల్లాసంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగులగొట్టారు. సర్వసాధారణంగా సర్వజగద్రక్షకుడైన స్వామివారి చిద్విలాసాన్ని తిలకించి పులకించడం భక్తుల వంతైతే ఉట్లోత్సవంనాడు భక్తుల ఉత్సాహాన్ని తిలకించి ఆనందించడం స్వామివార్ల వంతు కావడం విశేషం.



Related posts

Leave a Comment