శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా ఆణివార ఆస్థానంకలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా టీటీడీ ఆదాయ వ్యయాలు, నిలువలు మొదలైన వాటికి సంబంధించిన వార్షిక లెక్కలను స్వామివారికి నివేదించారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత స్వామి, దేవేరులు, సేనాధ్యక్షుడు విష్వక్సేనులవారి ఉత్సవమూర్తుల సమక్షంలో కొలువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.

ముందుగా ఆగమానుసారం పెద్ద జీయంగారు, చిన్న జీయంగారుతో కలిసి పెద్ద వెండితట్టలో మడతపెట్టిన ఆరు పెద్ద పట్టు వస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆరు పట్టువస్త్రాల్లో నాలుగింటిని మూలమూర్తికి అలంకరించి మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. అటు తరువాత ‘లచ్చన’ తాళపు చెవి గుత్తిని తిరుమల పెద్ద జీయంగారికి, చిన్న జీయంగారికి వరుస క్రమంలో కుడిచేతికి తగిలించి హారతి, చందన, తాంబూల, తీర్థ, శఠారి మర్యాదలు చేశారు. అనంతరం రూపాయి హారతిని నివేదించారు. దీనితో ఆణివార ఆస్థానం ఘనంగా ముగిసింది. ఉదయం 7.00 గం||ల నుండి 8.30 గం||ల వరకు ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ శనివారంనాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

IMG-20160716-WA0003.jpg
ఈ సందర్భంగా టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారికి తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, పేష్కార్‌ శ్రీసెల్వం ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారికి కానుకగా శ్రీరంగం సారె:
ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం ఆలయ సంస్థానం నుండి శ్రీవారికి నూతన పట్టువస్త్రాలు, పూలమాలలు కానుకగా వచ్చాయి. ఈ కానుకలకు శ్రీ బేడి ఆంజనేయస్వామివారి చెంత వున్న పెద్దజీయంగార్‌ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పెద్దజీయంగార్‌, శ్రీ చిన్న జీయంగార్‌ ఈ పట్టువస్త్రాలను మాడ వీధుల నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు, జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు కలిసి వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో  శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయ ఈవోకు, ధర్మకర్తల మండలి సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు.
కన్నుల పండుగగా పుష్పపల్లకి ఉత్సవం :
ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు వివిధ రకాల పుష్పాలతో సర్వాంగసుందరంగా తయారైన పుష్పపల్లకిపై శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నేత్రపర్వంగా తిరుమాడ విధులలో ఊరేగుతూ భక్తులకు దివ్యానుభూతిని కలిగించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.Related posts

Leave a Comment