ఆగస్టు 7 నుంచి శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులకు దర్శనం



కృష్ణా పుష్కరాల్లో టీటీడీ తరఫున విస్తృత ఏర్పాట్లు
తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు
పవిత్రమైన కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆగస్టు 7వ తేదీన ఉదయం 7.30 నుంచి 9.00 గంటల మధ్య విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో శ్రీవారి నమూనా ఆలయానికి ఆగమోక్తంగా ప్రతిష్ఠ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు వెల్లడించారు. పుష్కరాల కోసం టీటీడీ తరఫున జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి బుధవారం జెఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా పిడబ్ల్యుడి మైదానాల్లో జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న కృష్ణా పుష్కరాల్లో భక్తులకు సేవలందించేందుకు టీటీడీ తరఫున విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకశ్రద్ధతో శ్రీవారి నమూనా ఆలయం  కోసం నగరం నడిబొడ్డున గల పిడబ్ల్యుడి మైదానాలను కేటాయించారని వివరించారు.
పిడబ్ల్యుడి మైదానాల్లో ఈశాన్యం వైపు నుంచి నాలుగు వరుసల్లో భక్తులను ఆలయానికి అనుమతిస్తామని, ఇక్కడ పాదరక్షలు భద్రపరుచుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని జెఈవో తెలిపారు. ఆలయం లోపల కూడా నాలుగు వరుసల్లో భక్తులు స్వామివారిని దర్శించుకునే ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం హుండీ వైపు నుంచి వెలుపలికి వెళ్లే భక్తులకు చక్కెర పొంగళి, పులిహోర, చిన్నలడ్డూలు ప్రసాదంగా అందిస్తామని వివరించారు. ఆలయం ప్రాంగణంలో టీటీడీ ఆయుర్వేద డిస్పెన్సరీ, జిల్లా వైద్యశాఖ, టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తామన్నారు. హుండీ కానుకలు లెక్కించేందుకు పరకామణి విభాగంతోపాటు ఆయుర్వేద, ఫలపుష్ప, ఫొటో ఎగ్జిబిషన్లు, పుస్తక విక్రయశాల ఏర్పాటు జరుగనుందన్నారు.
భక్తుల భద్రత కోసం టీటీడీ భద్రతా విభాగం ఆధ్వర్యంలో సిసి కెమెరాలతో నిఘా ఉంటుందని, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో గల వేదికపై సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవ ఉంటుందని, అదేవిధంగా వేదఘోష, గాత్ర, వాయిద్య సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 24 గంటల పాటు అఖండనామ సంకీర్తనం నిర్వహిస్తామన్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో అమరావతిలోని బుద్ధ విగ్రహం వద్ద, శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు ఆలయం వద్ద ఆధ్యాత్మిక, సంగీత, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.
రోజుకు 25 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలను ప్యాకెట్ల రూపంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జెఈవో తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 800 మంది అధికారులు, సిబ్బంది, వెయ్యి మంది శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్లు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలను వినియోగిస్తున్నట్టు వివరించారు. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, ఎస్‌ఇ శ్రీసుధాకరరావు, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, ఇఇ శ్రీ నాగేశ్వరరావు, ఎలక్ట్రికల్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ శ్రీ రవిశంకర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీకి పూర్తి సహకారం అందిస్తాం : కలెక్టర్‌ శ్రీ ఎ.బాబు
కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయం వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీకి పూర్తి సహకారం అందిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ శ్రీ ఎ.బాబు తెలిపారు. టీటీడీ అధికారులతో కలిసి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు బుధవారం కలెక్టర్‌తో సమావేశమయ్యారు. శ్రీవారి నమూనా ఆలయం వద్ద తాగునీటి వసతి, పారిశుద్ధ్యం, వైద్యకేంద్రం తదితర ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగంతో కలిసి సహకరించాలని జెఈవో కోరారు. టీటీడీకి సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ జి.చంద్రుడు, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ శ్రీమతి సృజన, నూజివీడు సబ్‌కలెక్టర్‌ శ్రీమతి లక్ష్మీ షా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీ బాలాజి, డిఆర్‌డిఏ పిడి శ్రీ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment