కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష



పవిత్రమైన కృష్ణా నది పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభంకానుండడంతో టీటీడీ తరఫున చేపడుతున్న ఏర్పాట్లపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పుష్కరాల్లో విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో ఏర్పాటు చేయనున్న శ్రీవారి నమూనా ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీటీడీ చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వివరించారు.

శ్రీవారి నమూనా ఆలయం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను జెఈవో ఆదేశించారు. అన్ని విభాగాల అధిపతులు జులై 12 నాటికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అన్నప్రసాదం, ఆరోగ్య విభాగం, భద్రత, ఆలయం, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ప్రజాసంబంధాల విభాగం, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారులతో కలిసి జులై 13వ తేదీన విజయవాడలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహిస్తామన్నారు. పుష్కరాల ప్రారంభానికి వారం ముందు అనగా ఆగస్టు ఏడో తేదీన శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.

పుష్కరాల్లో ప్రధాన ఏర్పాట్లు :

– ఆగస్టు 7న ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభం.

– అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

– ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఊంజల్‌ సేవ.

– రాత్రి 10 గంటలకు ఆలయం మూసివేస్తారు.

– రోజూ రెండుసార్లు వేదఘోష.

– స్వామివారి దర్శనం తరువాత భక్తులకు చిన్నలడ్డూలు, అన్నప్రసాదాలు పంపిణీ.

– 1000 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.

– తిరుమల నుండి కృష్ణా పుష్కర యాత్ర ప్రారంభమవుతుంది. తిరుచానూరు, ఒంటిమిట్ట, అహోబిలం, శ్రీశైలం మీదుగా శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభించే ముందుగానే విజయవాడకు చేరుకుంటుంది.

– హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు.

– శ్రీవారి నమూనా ఆలయం ప్రాంగణంలో ఫొటో, మ్యూజియం ఎగ్జిబిషన్లు.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment