వసతిగదుల్లో నెల లోపు మరింత మెరుగైన సౌకర్యాలు : టీటీడీ ఈవో డా|| డి.సాంబశివరావు



తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వసతి గదుల్లో ఒక నెలలోపు సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వసతిగృహాలు, చౌల్ట్రీల్లో తాగునీరు, స్నానానికి వేడినీరు అందుబాటులో ఉంచడంతో పాటు కొళాయిలు, వాష్‌బేషిన్‌లు, విద్యుద్దీపాలు తదితరాల మరమ్మతులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రానుండడంతో దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్టలో భక్తులు పాదరక్షలు భద్రపరుచుకునేందుకు మరో వెయ్యి ర్యాక్‌లు ఏర్పాటు చేయాలని, పాదరక్షల దొంగలపై సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు దర్శన సమయం రెండు గంటల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పునఃప్రవేశ(రీఎంట్రీ) టోకెన్లు మంజూరుచేయాలని, ఈ విషయాన్ని భక్తులందరికీ తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

శ్రీవారి ఆలయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించేందుకు వీల్లేకుండా మొబైల్‌ హుండీల మరమ్మతులు చేపట్టాలని, సిసి కెమెరాలు పెంచాలని ఈవో కోరారు. పరకామణిలో దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలన్నారు. తిరుపతిలోని చిల్లర నాణేల పరకామణిని ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌, హెల్త్‌ శాఖలు సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి సమన్యలు తలెత్తకుండా నిర్మించాలని ఆదేశించారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై శాఖల వారీగా అధికారులు ఎంతవరకు పరిష్కరించారని ఆరా తీశారు. ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌ను పరిశీలించి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో సాధ్యసాధ్యాలను పరిశీలించాలన్నారు. మరో వారం రోజుల్లో శ్రీవారి వెండి, రాగి డాలర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈవో ఆదేశించారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

శ్రీ సత్యసాయి సేవా సంస్థ, శ్రీ రామకృష్ణ మఠం, బ్రహ్మకుమారీ సేవా సంస్థ తదితర స్వచ్ఛంద సేవా సంస్థల్లో సేవలందిస్తున్న టీటీడీ ఉద్యోగులను గుర్తించి వారికి శ్రీవారి సేవలో బాధ్యతలు అప్పగించాలన్నారు. శ్రీవారి సేవకులకు ప్రస్తుతం రాయితీ ధరపై ఒక్కొక్కటి రూ.10/- చొప్పున మూడు లడ్డూలు ఇస్తున్నామని, భక్తుల రద్దీ లేని సమయంలో ఒక్కొక్కటి రూ.25/- చొప్పున మరో 3 లడ్డూలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు టీటీడీ విద్యాసంస్థలతోపాటు బయటి కళాశాలలకు చెందిన ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఎస్వీబీసీలో భక్తిభావం పెంచేలా భజనలు, ప్రముఖ పండితులతో ఉపన్యాసాలను తరచూ ప్రసారం చేయాలని ఈవో సూచించారు. నాదనీరాజనం కార్యక్రమంలో ఎదురుగా కూర్చొని వీక్షించే భక్తులకు స్పష్టంగా వినిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలో అన్నిచోట్లా అందంగా ఉద్యానవనాలు పెంచాలన్నారు. వర్షాకాలం మొదలయ్యే నాటికి అన్ని డ్రైనేజీల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో తితిదే చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ బాలాజి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ముఖ్య భద్రతాధికారి శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.



Related posts

Leave a Comment