వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవంశ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన సోమవారంనాడు వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

సోమవారం సాయంత్రం శ్రీ స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే శ్రీస్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరుగుతుంది. ఈ కొలువులో హరికథ, నృత్యం, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగుస్తుంది.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తితిదే ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 Related posts

Leave a Comment