దాతల కోసం ప్రత్యేకంగా టిటిడి ఎస్‌ఎంఎస్‌ అప్లికేషన్‌ :టిటిడి ఈవో డా|| డి.సాంబశివరావు

టిటిడికి విరాళాలు అందిస్తున్న దాతలకు మరింత పారదర్శకంగా సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ పంపేందుకు అప్లికేషన్‌ రూపొందించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతలు తిరుమలకు విచ్చేసినపుడు శ్రీవారి దర్శనం, బస, లడ్డూ ప్రసాదం ఇతర సదుపాయాలు అందుకున్న వెంటనే ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ అందేలా అప్లికేషన్‌ తయారుచేయాలని ఐటి విభాగం అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, దాతలు కూడా తమకు అందుతున్న సదుపాయాలను తెలుసుకునేందుకు వీలవుతుందని అన్నారు. అనంతరం రెండో కనుమ రోడ్డులో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను ఈవో సమీక్షించారు.

సమావేశం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో భక్తుల రద్దీకి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. శని, ఆదివారాలు మినహా క్యూలైన్‌ వెలుపలికి రావడం లేదన్నారు. వారాంతంలో వెలుపలికి వస్తున్న భక్తుల క్యూలైన్‌ను నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో క్రమబద్దీకరిస్తున్నట్టు తెలిపారు.

తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విభాగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎఫ్‌ఏ అండ్‌ సిఏఓ శ్రీబాలాజి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.Related posts

Leave a Comment