నేటితో ముగిసిన టిటిడి పాలకమండలి పదవి కాలం*ఎటూ తేలని టిటిడి ధర్మకర్తల మండలి భవితవ్యం
 

*జీవో ప్రకారం ముగిసిన ఏడాది పదవీ కాలం
 

*ప్రమాణస్వీకారం ప్రకారం
 

*మే రెండు వరకు కొనసాగించిన టిటిడి
 

*పొడిగింపుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి
 

*మార్పులపై సీఎం కసరత్తు, పెరిగిన ఆశావహుల ఒత్తిడి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపుపై సందిగ్ధం వీడడం లేదు. నిబంధనల ప్రకారం గత బుధవారంతోనే టిటిడి బోర్డు పదవీకాలం ముగిసింది.అయితే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేస్తుందా..? లేక పాత పాలకమండలినే కొనసాగిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా బోర్డులో చోటు దక్కించుకునేందుకు అధికారపార్టీ నాయకులతో పాటు, పారిశ్రామిక వేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

టిటిడి ధర్మకర్తల మండలి నియామక ఉత్తర్వులు గత ఏడాది ఏప్రిల్ 26న వెలువడ్డాయి. టిటిడి చైర్మన్‌గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఆమేరకు మే 2వ తేదీన చైర్మన్‌తోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆ ప్రకారం ఈ దర్మకర్తల మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 2న కాబట్టి ఈ ఏడాది మే 2 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. అందువల్లే జీవో ప్రకారం పదవీ కాలం ముగిసినా ప్రమాణస్వీకారం తేదీని దృష్టిలో ఉంచుకుని చైర్మన్‌తోపాటు సభ్యులకు అందాల్సిన మర్యాదలన్నీ గురువారం కూడా  కొనసాగించారు. సాయన్నతోపాటు పలువురి మార్పులపై కసరత్తు

చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు రెండేళ్లు పొడిగించారు. అదే నిర్ణయానే టిటిడికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సభ్యుల్లోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత టిటిడి ధర్మకర్తల మండలి  సమావేశాలకు వరుసగా నాలుగుసార్లు హాజరుకాలేదు. ఈయన తొలగింపుపై టిటిడి, ఎండోమెంట్ చట్టంతోపాటు న్యాయ సలహా తీసుకున్నారు. పనిలో పనిగా ఒకరిద్దరు సభ్యులు మార్పుపై కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు  ప్రచారం సాగుతోంది.

 సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి?

టిటిడి చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అలాగే, నరసారావుపేట ఎంపీ  రాయపాటి సాంబశివరావు కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చర్చ సాగుతోంది. ఇక బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. తాజా బోర్డు ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కొత్త బోర్డుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి వరకు దీనిపై ఎటువంటి స్పష్టమైన నిర్ణయం వెలువడ లేదు. పాత బోర్డు కొనసాగింపా? కొత్త బోర్డు నియామకమా? అన్నది శుక్రవారం తేలిపోనుంది. అలా రానిపక్షంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Orugunda Suresh
Sr Reporter

Orugunda Suresh is an electronic media journalist with eight plus years of experience. He excels in visual communication and has worked as correspondent for premier media organisations such as Maa TV, Mahaa TV,  TV9 Network, ETV Network(TV18 Group), Studio N. He contributes news stories and features  to thirupatinews.com from Tirumala and Tirupati.Related posts

Leave a Comment