వేసవిలో భక్తుల సేవకు ”శ్రీవారి సేవ” సన్నద్ధంవేసవిలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవ విభాగం సన్నద్ధమవుతోంది. భారతదేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల మంది శ్రీవారి సేవకులు విచ్చేయనున్నారు. వీరు జూన్‌ 22వ తేదీ వరకు వేసవి రద్దీలో భక్తులకు విశేషంగా సేవలందించనున్నారు. ఒక రోజుకు తిరుమలలో 2500 మంది, తిరుపతిలో 500 మంది సేవలందిస్తారు.

తిరుమలలోని శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 1, 2, బయటి క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధీకరించడం, పాలు, మజ్జిగ, అన్నప్రసాదం తదితర ఆహార పదార్థాలను అందించడం, అన్నప్రసాద భవనం, పిఎసి-2లలో భక్తులకు వడ్డించడం, కూరగాయలు తరగడం తదితర విధులు నిర్వహించడంతోపాటు విజిలెన్స్‌, లడ్డూ ప్రసాద వితరణ, కల్యాణకట్ట, ఆరోగ్యశాఖ, రవాణా విభాగం, ఉద్యానవన విభాగం, వగపడి, రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌, యాత్రికుల వసతి సముదాయాలు తదితర 25 విభాగాల్లో శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.

ప్రత్యేకించి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం వడ్డించేందుకు మొదటి షిఫ్టులో ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు, రెండవ షిఫ్టులో సాయంత్రం 4.00 నుంచి రాత్రి 11.00 గంటల వరకు, కూరగాయలు తరిగేందుకు మొదటి షిఫ్టులో ఉదయం 6.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 2.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు. సాధారణ రోజుల్లో అన్నప్రసాదం వడ్డించేందుకు రెండు షిప్టుల్లో 250 మంది, కూరగాయలు తరిగేందుకు 100 మంది శ్రీవారి సేవకులు అవసరమవుతారు. పర్వదినాలు, ఇతర రద్దీ రోజుల్లో సేవకుల సంఖ్య రెట్టింపు అవుతుంది.

లడ్డూ ప్రసాద సేవకు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన సాధారణ భక్తులకు కూడా తితిదే అవకాశం కల్పిస్తోంది.

అదేవిధంగా, తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులతో పాటు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కోదండరామస్వామి, అలిపిరి పాదాలమండపం వద్ద గల శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారు. శ్రీనివాసం, విష్ణునివాసంలో కాషన్‌ డిపాజిట్‌ లేకుండా లాకర్ల వసతిని తితిదే భక్తులకు కల్పిస్తోంది. ఈ విషయంపై శ్రీవారి సేవకులు భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.

18 నుంచి 60 ఏళ్లలోపు వారే అర్హులు :

తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవ చేసేందుకు 18 నుంచి 60 ఏళ్లలోపు హిందువులు మాత్రమే అర్హులు. మహిళలు చంటిపిల్లలను తీసుకురాకూడదు. వయసు పైబడిన వారు, వ్యాధిగ్రస్తులు రాకూడదని తితిదే విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి సేవకు విచ్చేసే పురుషులు తెల్ల చొక్కా, పంచ లేదా ప్యాంటు, మహిళలు మెరూన్‌ బార్డర్‌తో కూడిన ఆరంజ్‌ కలర్‌ చీర, మెరూన్‌ రవిక విధిగా ధరించాలి.

తితిదే కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆదేశాల మేరకు ప్రజాసంబంధాల విభాగం ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరింత మెరుగైన సేవలందించే విధంగా ప్రోత్సహిస్తోంది.Related posts

Leave a Comment