25 నుంచి తిరుమలలో ఉచిత వివాహాలు ‘కల్యాణం’ పేరిట టిటిడి నూతన పథకం 

తిరుమలలో ఉచితంగా వివాహాలు జరిపించాలని టిటిడి యాజమాన్యం శుక్రవారం నిర్ణయించింది. దీనిలోభాగంగా‘కల్యాణం’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 25 నుంచి పథకాన్ని ప్రారంభించాలని సంకల్పించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. ఈ దేవదేవుని పాదాల చెంత మూడు ముళ్లబంధంతో ఒక్కటవ్వాలని చాలా మంది వధూవరులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఇకపై వధూవరులకు కల్యాణవేదికలో ఉచితంగా వివాహాలు జరిపించాలని పథకాన్ని చేపట్టింది. పాపవినాశనం తీర్థం మార్గంలోని కల్యాణవేదికపై నిత్యం వివాహాలు జరుగుతున్నాయి.

శ్రీవారి కంకణాలు  నూతన జంటలకు పసుపు,కుంకుమ,

ఉచితంగా పది చిన్న లడ్డూలు

ప్రస్తుతం ఇక్కడ వివాహం చేసుకోవాలంటే పురోహితులకు రూ.500, మేళానికి రూ.300, వీడియోలు, ఛాయాచిత్రాలు తీసుకుంటే విద్యుత్‌ రుసుముల కింద రూ.60 వంతున వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్లను సోమవారం నుంచి పూర్తిగా రద్దు చేయాలని టిటిడి ఈవో సాంబశివరావు సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. ఇక్కడ వివాహం చేసుకునే వధూవరులతో పాటు తల్లిదండ్రులకు ‘సుపథం’ మార్గం నుంచి ఆలయ ప్రవేశం ఉచితంగా కల్పించి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులతో పకడ్బందీగా వివాహాలు జరిపించి పలు సేవలు అందించాలని కూడా టిటిడిసంకల్పించింది. వధూవరులకు, తల్లిదండ్రులకు ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు జారీ చేసి స్వామి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. నూతన జంటలకు పసుపు, కుంకుమ, కంకణాలు, పది చిన్న లడ్డూలు ఉచితంగా అందచేయాలని భావిస్తోంది.

వివాహాల తేదీలను నమోదు చేసుకునేందుకు వీలుగా రెండు వారాల్లోపు ఆన్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధానం కింద వసతి కోసం గదులు కేటాయింపు, శ్రీవారి దర్శనం టిక్కెట్లు కేటాయింపు జరుగుతుంది. వివాహానికి అవసరమైన వస్తువులనూ ఉచితంగా అందించాలని దేవస్థానం భావిస్తోంది. కల్యాణవేదిక ప్రాంగణంలో ప్రభుత్వ వివాహ రిజిస్ట్రేషన్‌ కేంద్రంను ఏర్పాటు చేయనుంది. వివాహం జరిగిన అరగంట వ్యవధిలో ధ్రువీకరణ పత్రం అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. త్వరలో మరిన్ని మార్పులతో వివాహాలను ఘనంగా జరిపించడానికి టిటిడి చర్యలు తీసుకుంటోంది.Related posts

Leave a Comment